ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఈ పదవిని తీసుకోవడానికి అంగీకారం తెలిపారు.. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లను కలిశారు. అయితే చాగంటికి వైఎస్సార్‌సీపీ హయాంలో కూడా టీటీడీకి సంబంధించి సలహాదారుడి పదవి ఇచ్చారు.. కానీ ఆయన వద్దని చెప్పారు. దీంతో అప్పుడు (గత ప్రభుత్వంలో) పదవి ఎందుకు తీసుకోలేదు.. ఇప్పుడు (కూటమి ప్రభుత్వంలో) పదవి ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
గత ప్రభుత్వంలో పదవి ఎందుకు తీసుకోలేదు.. కూటమి ప్రభుత్వంలో పదవి ఎందుకు తీసుకున్నారో చాగంటి కోటేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలను ప్రస్తావించారు. తనకు కూటమి ప్రభుత్వం సలహాదారుడి పదవి ఇచ్చినప్పుడు.. కొందరు పదవిని తీసుకుంటున్నారా అని అడిగారని ఆయన గుర్తు చేశారు. తాను పదవిని తీసుకుంటున్నానని చెప్పగానే.. 'మీకు గతంలో టీటీడీలో పదవి ఇస్తే ఎందుకు తీసుకోలేదని' కొందరు ప్రశ్నించారని.. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని వివరించారు. ఒక పదవిని తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయంపై ఉండదన్నారు.
ఒకప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే సలహాదారు పదవి ఎంతో గౌరవంగా ఇచ్చారని.. కానీ తాను అప్పుడు కూడా తీసుకోలేదన్నారు చాగంటి. తాను భారత ఆహార సంస్థలో ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నానని.. అది కూడా పదవీ విరమణకు సమయం దగ్గరపడిందన్నారు. ఆ సందర్భంలో తాను మారి ఇంకో చోటికి వెళ్లి మళ్లీ ఇక్కడ పదవీ విరమణకు డాక్యుమెంట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది వస్తుందని ఆ సమయంలో వెళ్లలేదన్నారు. తాను వెళ్లకుండా అక్కడే ఉండిపోయాను.. ఆ పదవి తనకు వద్దని చెప్పానన్నారు.
రెండోసారి తనకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారుగా ప్రకటించారన్నారు కోటేశ్వరరావు. తాను వద్దని చెప్పానని.. దీనికి ఓ కారణం ఉందన్నారు. ఆ పదవి ప్రకటించిన సమయంలో.. అప్పటికే తాను 7, 8 నెలల వరకు ఉపన్యాసాలకు ముందే షెడ్యూల్ ఇచ్చేశానన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్ 30 రోజులు చెప్పేవి ఉంటాయని.. అవి చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చెప్పాల్సినవి ఉన్నాయన్నారు. అలాంటప్పుడు ఖాళీ(సమయం) ఉండదన్నారు. అప్పుడు తాను టీటీడీ ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే తాను వెళ్లలేనన్న విషయం తనకు తెలుసన్నారు. ఆ సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో తాను ఎక్కడ ఉంటానో కూడా తెలియదన్నారు. ఉదాహరణకు.. అనంతపురంలో నాలుగు రోజులు ఉండి ఉపన్యాసాలు చెప్పి ఆ తర్వాత బళ్లారి వెళ్లొచ్చు, శ్రీకాకుళం వెళ్లొచ్చన్నారు.. దగ్గరలోనే ఉపన్యాసాల కోసం వెళ్లాలనే నియమం ఉండదు కదా అన్నారు. సలహాదారుడు పదవి తీసుకుంటే టీటీడీ ఆకస్మాత్తుగా ఓ సమావేశం పెట్టి రండి అంటే తాను రాలేనని చెప్పాలన్నారు.
అలాంటి బిజీ ఉన్నప్పుడు.. తాను ఆ పదవిని ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు చాగంటి. తాను వెళ్లలేనన్న విషయం తనకు తెలుసని.. వాళ్లు తనను సలహా చెప్పాలని అడిగారన్నారు. ఒకవేళ తన వల్ల నిజంగా ఏదైనా సలహా కావాలంటే పదవే అక్కర్లేదు.. తనకు ఫోన్ చేసినా చెప్పగలిగింది అయితే చెప్తానని వారికి తెలియజేశానన్నారు. అందుకే పదవి వద్దని చెప్పానని.. తాను ఇంతటి ఒత్తిడిలో వెళ్లలేననే పదవి వద్దని చెప్పినట్లు వివరించారు. అలాగే తాను చెప్పిన ప్రవచనాలను వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్లు ఎన్నో సంవత్సరాలుగా ప్రసారం చేస్తున్నారన్నారు. తాను వాళ్లు ఏది అడిగినా.. వాళ్లు చెప్పింది తాను ఇచ్చాన్నారు. తాను ఎవరి దగ్గరా పైసా తీసుకోనని.. అందుకే అప్పుడు ఆ పదవి తీసుకోలేదన్నారు.
తాను ఇప్పుడు పదవీ విరమణ చేశానని.. ఇప్పుడు తనకు ఏదో కొన్ని, కొన్ని ఉపన్యాసాలు ఒప్పుకున్నవి ఉన్నాయన్నారు కోటేశ్వరరావు. కానీ తాను దీని గురించి ఒక స్పష్టత వచ్చి.. పిల్లలకు చెప్పడానికి, తాను కాలాన్ని ప్రణాళిక చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సమయం అన్నారు. అందుకే తాను ఈ పదవిని తీసుకోవడానికి అంగీకరించినట్లు చెప్పారు. అంతకు మించి గతంలో పదవి తీసుకోకపోవడానిక వేరే కారణాలు ఏవీ లేవన్నారు.