16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. అంబులెన్స్ డ్రైవర్, అతడి ఫ్రెండ్ ఇద్దరూ కలిసి.. బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన తర్వాత.. జరిగిన దారుణాన్ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలిక ఫిర్యాదు చేయడంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరిపి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు.
మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో ఈనెల 25వ తేదీన జరిగిన ఈ దారుణమైన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి అత్యవసర సేవలు అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, అతడి ఫ్రెండ్ రాజేష్ కేతవ్లు.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 16 ఏళ్ల బాలికను చూశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో వెంటనే ఆమెను బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
ఆ తర్వాత అంబులెన్స్ కదులుతుండగానే.. ఒకరి తర్వాత ఒకరు వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేతవ్లు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఆమెను ఓ చోట వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అత్యాచారం నుంచి తేరుకున్న బాలిక.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులు వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేతవ్లు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వీరిద్దరూ మౌగంజ్ జిల్లాలోని నైగర్హి తహసీల్‌కు చెందినవారని గుర్తించారు. బాలికను గ్యాంగ్ రేప్ చేసిన ప్రాంతం.. హనుమాన తహసీల్ నిందితుల గ్రామం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు. అనంతరం బాధిత బాలికను ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు తేలిందని మౌగంజ్ ఎస్పీ సర్నా ఠాకూర్ వెల్లడించారు.