రేషన్ బియ్యం అక్రమాలపై కాకినాడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చర్యలు తీసుకోకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమార్కులకు సహకరించడం పద్ధతిగా లేదని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని హెచ్చరించారు. పోర్టు అధికారుల పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీఎస్ఓ ప్రసాద్‌పై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా బియ్యం రవాణా అవుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోర్టుకు రేషన్ రైస్ వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. స్వయంగా సంబంధిత మంత్రి వచ్చి చెప్పిన అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.