ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అనకాపల్లి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి మండలంలో గతంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి జరుగుతోంది. నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, డీఎల్ పురం, వేంపాడు, బుచ్చిరాజుపేట, చందనాడ గ్రామాల పరిధిలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఆర్సెలర్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ ఉమ్మడి ఆధ్వర్యంలో 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానున్నది.
తొలిదశ ప్రాజెక్టుకు అవసరమైన 2,200 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. టౌన్‌షిప్ ఏర్పాటు కోసం వేంపాడు, నెల్లిపూడి, ఉద్దండపురం గ్రామాల్లో మరో 440 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రెండు దశల్లో ఏర్పాటు కానున్న ఉక్కు కర్మాగారానికి మొత్తం రూ.1,47,596 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు.