ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 10:54 PM

ఏపీ ఛాంబర్ బిజినెస్ ఎక్స్ పో అందరికీ ఉపయోగకరంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 160 మంది ఎగ్జిబిటర్స్ ఈ ఎగ్జిబిషన్ లో‌పాల్గొన్నారని తెలిపారు. గత ఐదేళ్లల్లో పరిశ్రమ రంగాన్ని పట్టించుకోలేదని.. ఉన్న పరిశ్రమలు కూడా తరలి పోయేలా భయపెట్టారని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధి‌ అవకాశాలు లేకుండా చేశారన్నారు. ప్రతిభ ఉన్న యువత ... పొట్ట చేత పట్టుకుని అవకాశాల‌ కోసం తరలివెళ్లారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వయంగా అనేక మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారని.. పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టాలని ఏపీకి ఆహ్వానించారన్నారు.


చిన్న తరహా పరిశ్రమలకు‌ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా మారాలనేది చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. రతన్ టాటా ఎలా ఎదిగారన్నది నేటి యువత తెలుసుకోవాలన్నారు.కొత్త కొత్తగా అవకాశాలకు సాంకేతికత జోడిస్తే రాణించవచ్చన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల తరహాలో అనేక చిన్న పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కింద ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. చేతి వృత్తుల ఉత్పత్తులు, మైక్రో ఇండస్ట్రీస్‌కు మార్కెటింగ్ అవసరమన్నారు. ఏపీలో తప్పకుండా పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని.. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని వెల్లడించారు. ‘‘కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారు లక్ష్యాలతో ముందుకు రండి... మీ ‌కలలను నిజం చేసుకోండి. ఇటువంటి బిజినెస్ ఎక్స్ పో ద్వారా మరింత అవగాహన పెంచుకోండి. ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, విధివిధానాల గురించి తెలుసుకోండి. ప్రతి ఇంటి నుంచి ఒక‌రు పారిశ్రామికవేత్తగా ఎదగాలి’’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. కాగా.. మూడు రోజుల పాటు జరిగే ఎక్స్ పోలో 150 అంశాల‌పై అవగాహన కల్పించనున్నారు. పరిశ్రమలు ఏర్పాటు, ప్రభుత్వం సహకారం, ఉన్న అవకాశాలు పై తొమ్మిది సెమినార్లు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com