బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్.. రెండు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంపై పంజా విసురుతోంది. తమిళనాడు, ఏపీ, పుదుచ్చేరిల్లో అల్లకల్లోలం రేపుతోంది.ప్రత్యేకించి- తమిళనాడు, పుదుచ్చేరిలపై దీని ప్రభావం అతి తీవ్రంగా ఉంటోంది. భారీ వర్షాలకు కారణమౌతోంది.ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పుదుచ్చేరికి ఈశాన్య దిశగా 150, చెన్నైకి 140, నాగపట్నానికి 210, శ్రీలంకలోని ట్రింకోమలికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై కనిపించింది.ఈ మధ్యాహ్నం తమిళనాడు ఉత్తర ప్రాంతం- పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్- మామళ్లాపురం మధ్య తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలుల తీవ్రవ గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వరకు పెరుగుతుందని పేర్కొంది.దీని ప్రభావం.. ఇప్పటికే తమిళనాడుపై పడింది కూడా. చెన్నైలో శుక్రవారం సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కాళ్లకురిచి, కడలూర్ జిల్లాలు ఈ భారీ వర్షాల వల్ల అతలాకుతలమౌతోన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.కొన్ని చోట్ల పట్టాలపై వర్షపు నీరు ప్రవహించడం కనిపించింది. తాంబరం, ఎగ్మూర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.చెన్నై డివిజన్ పరిధిలో రాకపోకలు సాగించే ఈము రైలు సర్వీసుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని ఈము సర్వీసులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఇదే తరహా పరిస్థితి విమాన సర్వీసులపైనా పడింది. చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు విమానాల రాకపోకలను నిలిపివేశారు. వర్ష తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎయిరిండియా, ఇండిగో సహా ఇతర పౌర విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి.చెన్నై, తిరుచిరాపల్లి, ట్యుటికోరిన్, మధురై, విశాఖపట్నం, తిరుపతిలకు నడిపించాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. రీ ఫండ్ లేదా రీ బుకింగ్ కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.