తమిళనాడులో బీభత్సం సృష్టించిన ఫెంగల్ (ఫెయింజల్) తుపాను చెన్నైలో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గత సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై వ్యాప్తంగా కుండపోత కురుస్తోంది. అయితే, భారీ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకున్నా తమిళనాడు, పుదుచ్చేరిలలో గత మూడు దశాబ్దాల్లోనే అత్యధిక వర్షపాతం (44 సెంటీమీటర్లు) నమోదైంది. తుపాను కారణంగా చెన్నై విమానాశ్రయం 16 గంటలపాటు మూతబడింది. ఈ ఉదయం 4 గంటలకు తెరుచుకున్నా చాలా వరకు విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. చెన్నై, పుదుచ్చేరి సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజా రవాణా స్తంభించింది. బస్సులు, రైళ్ల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో స్థిరంగా ఉన్న తుపాను క్రమంగా అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.