డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన ఓ యువకుడు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఫెయింజల్ తుపాను బీభత్సం సృష్టిస్తున్న చెన్నైలోని ముత్యాలపేటలో జరిగిందీ విషాదం. 20 ఏళ్ల చందన్ నిన్న డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. ఈ క్రమంలో ఏటీఎం బయట ఉన్న ఇనుప రాడ్డుపై చేతులు పెట్టి నిల్చోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో పడిపోయాడు. ఆ తర్వాత నీటిలో కొట్టుకుపోతున్న అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతడిది ఉత్తరప్రదేశ్‌గా పోలీసులు గుర్తించారు. తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు చెన్నై సహా సమీప జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. తుపాను కారణంగా చెన్నైలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఫెయింజల్ ప్రభావంతో గత మూడు దశాబ్దాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా కాగా, రోజు వారీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. విమాన, రైలు, రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది.