పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు ఇచ్చే బియ్యాన్ని గత ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు కాజేసి విదేశాలకు ఎగుమతి చేశారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఐదేళ్ల పాటు కాకినాడ పోర్ట్ నుంచి ఈ అక్రమాలు యథేచ్ఛగా సాగించారన్నారు. ఇందుకోసం పోర్టును గుప్పెట్లో పెట్టుకున్నారని, సామాన్యుల సంగతి పక్కన పెడితే జర్నలిస్టులనూ లోపలికి అనుమతించలేదని మంత్రి చెప్పారు. ఈమేరకు ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం రూ.12,800 కోట్లు ఖర్చు చేస్తోందని, అయితే, కొంతమంది ఈ బియ్యాన్ని పేదలకు చేరనివ్వడంలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం అక్రమ నిల్వలపై ఎక్కడికక్కడ దాడులు చేశామని మంత్రి నాదెండ్ల చెప్పారు. జూన్ చివరి వారంలో కాకినాడలోని 13 గిడ్డంగులలో తనిఖీ చేసి 25 వేల టన్నుల రేషన్ బియ్యం నిల్వలను గుర్తించామని తెలిపారు. ఈ విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే గత ఐదేళ్లలో ఎక్కువ ఎగుమతులు జరిగాయని వివరించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించి కాకినాడ పోర్టుకు చేర్చారని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేశారని తెలిపారు.కీలకమైన ఈ పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది కేవలం 20 మంది మాత్రమేనని, అక్రమార్కుల కోసం గత ప్రభుత్వం దేశ భద్రతనూ రిస్క్ లో పెట్టిందని మండిపడ్డారు. కాకినాడ పోర్టు వెనక ఎవరున్నారు.. ఇక్కడ ఏ స్థాయిలో అక్రమార్కులు పాతుకుపోయారో ప్రజలకు తెలియజెప్పేందుకే పోర్టులో తనిఖీలు చేస్తున్నామని మంత్రి వివరించారు. కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ పోర్టుకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల స్వయంగా పోర్టులో పర్యటించారని గుర్తుచేశారు. కాగా, కాకినాడ పోర్టులో జరిగిన అక్రమాలపై ద్వారంపూడి, కన్నబాబు గతంలో ఎందుకు మాట్లాడలేదని మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు. పోర్టుకు సంబంధించిన ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ జవాబు చెప్పాలని మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.