దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ వారం మదుపర్లకు పీడకలను మిగిల్చింది. గత రెండేళ్లలో చూసుకుంటే అత్యంత భారీ నష్టాలను కలిగించిన వారం ఇదే. బీఎస్ఈ నమోదిత కంపెనీల విలువ ఈ వారంలో రూ.19 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్, నిఫ్టీ 4 శాతం చొప్పున పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ జోరెమ్ పావెల్ భవిష్యత్తు వడ్డీ రేట్లపై చేసిన వ్యాఖ్యలను మార్కెట్ నెగిటివ్‌గా తీసుకుంది. దీంతో సెన్సెక్స్ 79 వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడిచింది
గురువారం ముగింపు (79, 218)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం దాదాపు 130 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిసేపు లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడి 79, 587 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం తర్వాత నష్టాలు మరింత పెరిగాయి. ఫార్మా తప్ప అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఒక దశలో 1300 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ 77, 874 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 1176 పాయింట్ల నష్టంతో 78, 041 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 50 పాయింట్ల లాభంతో రోజును ప్రారంభించింది. ఒక దశలో 420 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు 3647 పాయింట్ల నష్టంతో 23, 587 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, దివీస్ ల్యాబ్స్, అపోలో టైర్స్, యునైటెడ్ బ్రేవరీస్ షేర్లు లాభాలు అందుకున్నాయి. సైమెన్స్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఏబీబీ ఇండియా, పవర్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1188 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 816 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.02గా ఉంది.