రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న వాహనాలను కెమికల్స్ తీసుకెళ్తోన్న ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. పెట్రోల్ బంక్‌కు వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా.. అనేక వాహనాలు మంటలకు ఆహుతయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో సమీపంలో నిలిపి ఉన్న వాహనాల్లోని వారు చిక్కుకుని గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు ఫైర్ ఇంజిన్లతో అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. వాహనాలను ఢీకొట్టిన ట్రక్కులో రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. బంక్రోట స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనీశ్ గుప్తా మాట్లాడుతూ..‘‘ అగ్ని ప్రమాదంలో పలు వాహనాలు దగ్దమయ్యాయి.. అయితే, ఎన్ని వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయో స్పష్టం తెలియదు.. పలువురు మంటల్లో గాయపడ్డారు.. వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు అంబులెన్స్‌లో తరలించాం’’ అని తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పరుగులు తీశారు.
కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్టు తొలుత అధికారులు ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఈ సంఖ్య 7కు చేరుకున్నట్టు తెలిపారు. ఇంకా, క్షతగాత్రుల్లో పలువురి పరిస్తితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో మొత్తం 37 మంది గాయపడ్డారు. అటు, ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు, బాధితులను కలిసేందుకు సీఎం ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం శర్మ భరోసా ఇచ్చారు. మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్యాంకర్.. ట్రక్కును ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి ఉవ్వెత్తున ఎగిసిపడటం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.