జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అనుకోని సంఘటన జరిగి కుటుంబ పెద్ద దూరమైతే ఆ కుటుంబంలోని వారు రోడ్డున పడాల్సిన పరిస్థితులు వస్తాయి. అలా కూకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ అనేది భరోసా కల్పిస్తుంది. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. అయితే, ప్రమాద, జీవిత బీమా ఏదైనా తీసుకోవడం అంటే పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే, అలాంటి వారందరికీ బీమా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ప్రవేశపెట్టింది.
ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే ఏకంగా రూ.2 లక్షల ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తోంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఏడాదికోసారి రూ.20 చెల్లిస్తూ రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో 18 ఏళ్ల వయసు వచ్చిన వారి నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణించడం లేదా శ్వాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షలు కేంద్రం అందిస్తుంది. పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష ఇస్తారు. అయితే, ఆత్మహత్య చేసుకుంటే స్కీమ్ వర్తించదు. హత్యకు గురైతే కవరేజీ వర్తిస్తుంది. ముఖ్యంగా బ్యాంక్ ఖాతా మూసివేస్తే, ఆటో డెబిట్ కోసం ఖాతాలో నగదు లేకుండా పాలసీ రద్దవుతుంది. 70 ఏళ్ల వయసు దాటితే బీమా వర్తించదు.
48 కోట్ల మంది చేరిక..
కొద్ది రోజుల క్రితమే ఈ స్కీమ్ వివరాలు వెల్లడించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. నవంబర్ 11, 2024 వరకు ఈ పథకంలో మొత్తం 47.59 కోట్ల మంది చేరినట్లు తెలిపింది. 1,93,964 క్లెయిమ్స్ వచ్చాయని, అందులో 1,47,641 క్లెయిమ్స్ సంబంధించిన రూ.2,931.98 కోట్లు డబ్బులు చెల్లించినట్లు తెలిపింది.
ఎలా చేరాలంటే?
ఈ స్కీమ్‌లో చేరాలంటే బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉండాలి. అకౌంట్‌కి ఆధార్ లింక్ అయి ఉండాలి. ఒకటికన్నా ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు ఒకే ఖాతా ద్వారా ఈ స్కీమ్‌లో చేరాలి. రెండు అకౌంట్ల నుంచి ప్రీమియం కట్టినా ఒకటే బెనిఫిట్ వస్తుంది. బ్యాంకుకు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరతామని అప్లికేషన్ చేసుకోవాలి. జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 1 లోపు ప్రీమియం ఆటో డెబిట్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. వద్దనుకుంటే దరఖాస్తు చేసి ఆపవచ్చు.