ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. దీనిలో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను ప్రజలపై మోపుతున్నాడు అని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అయన మాట్లాడుతూ.... గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆనాడు విద్యుత్ చార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా స్వర్గీయ వైయస్ఆర్ పెద్ద ఎత్తున ఉద్యమించారు.
చంద్రబాబు ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు ఏకంగా రైతులపై పోలీసులతో కాల్పులు చేయించి, రక్తపాతానికి కారణమయ్యాడు. నేడు రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు వల్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోంది. ప్రజలకు అండగా వైయస్ఆర్ సీపీ ఈనెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం అని పిలుపునిచ్చారు.