ప్రముఖ భారత విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సోమవారం ఓ ప్రత్యేకమైన గెట్ అవే సేల్ ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లపై రాయితీ ధరలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ సేల్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారికి దేశీయ రూట్లలో కనిష్ఠంగా రూ.1199 కే విమాన ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే అంతర్జాతీయ రూట్లలో అయితే కనిష్ఠంగా రూ.4,499 కే విమాన టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
టికెట్ల బుకింగి డిసెంబర్ 23వ తేదీనే ప్రారంభమైంది. డిసెంబర్ 25వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ సేల్ సందర్భంగా టికెట్లు బుక్ చేసుకుని 2025, జనవరి 23 నుంచి ఏప్రిల్ 30, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. శీతాకాలంతో పాటు వేసవి కాల ప్రత్యేక టూర్ వెళ్లాలని భావించే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. తగ్గింపు ధరలతో పాటుగా ఎంపిక చేసిన 6e యాడ్ ఆన్‌లపై ఇండిగో గరిష్ఠంగా 15 శాతం డిస్కౌంట్ కల్పిస్తోంది. ఇందులో ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీ (15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు), ప్రామాణిక సీటు ఎంపిక, ఎమర్జెన్సీ ఎక్స్‌ఎల్ సీట్ల వంటివాటిపై డిస్కౌంట్ పొందవచ్చు. ఈ యాడ్ ఆన్ల ధరలు దేశీయంగా రూ.599, అంతర్జాతీయ వీమానాలకు రూ.699 నుంచి ప్రారంభమవుతున్నాయి.
రూ.5000 వరకు రాయితీ..
ఇక ఈ స్పెషల్ గెట్ అవే సేల్ సందర్భంగా టికెట్లు బుక్ చేసుకునే వారితో పాటు ఇతర ప్రయాణికులకు సైతం బంపర్ ఆఫర్ ఉంది. ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు వినియోగించి టికెట్లు బుక్ చేసినట్లయితే అదనపు డిస్కౌంట్లు పొందవచ్చని ఇండిగో తెలిపింది. ఈ డిసెంబర్ 31లోపు బుకింగ్ చేసే దేశీయ ప్రయాణ టికెట్లపై 15 శాతం, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తామని తెలిపింది. ఫెడర్ బ్యాంక్ కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.5 వేల వరకు ఆదా చేసుకోవచ్చని పేర్కొంది.