35 మందికి మృతికి కారణమైన 62 ఏళ్ల వ్యక్తికి చైనా ఈరోజు ఉరిశిక్ష అమలు చేసింది. దక్షిణ చైనాలోని జుహాయ్ నగరంలో గతేడాది నవంబర్ 11వ తేదీ సాయంత్రం ఘోరం జరిగింది. జుహై నగరంలోని స్పోర్ట్స్ సెంటర్ బయట ఉన్న జన సముహంపైకి 62 ఏళ్ల ఫ్యాన్ వికియు అనే వ్యక్తి తన కారుతో వేగంగా దూసుకెళ్లాడు. ఈ దుర్ఘటనలో 35 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మందికి తీవ్రంగా గాయపడ్డారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. అతడు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
2014 నుంచి చైనా వ్యాప్తంగా జరిగిన అత్యంత ఘోరమైన ఘటన ఇది. ఉద్దేశ పూర్వకంగానే జన సమూహంపైకి కారును వేగంగా నడిపినట్లు అధికారుల విచారణలో వెల్లడి అయింది. ప్రమాదానికి కారణమైన 62 ఏళ్ల వికియు ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే భార్యతో విడాకులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వృద్ధాప్యంలో భార్య దూరం కావడం, వ్యక్తిగత సమస్యలు, చికాకులతో జీవితంపై అసంతృప్తి చెందాడు. అలాగే ఆమెతో ఆస్తి పంపకాల విషయంలో కూడా తీవ్ర మనస్తాపం చెందాడు. ఈక్రమంలోనే కావాలనే తాను ఈ దారుణానికి పాల్పడినట్లు వికియు అధికారుల ముందు ఒప్పుకున్నాడు.
అత్యంత క్రూరంగా, తీవ్రతతో సమాజానికి చెడు చేయాలన్న ఉద్దేశంతో చేసిన ఈ దాడి తీవ్రమైనదిగా న్యాయస్థానం పరిగణించింది. చైనాలో ఇలాంటి నేరాలు జరగడం చాలా అరుదు. పాశ్చాత్య దేశాల్లో చూసే ఇలాంటి తరహా ఘటనలు చైనాలో దాదాపుగా జరగవు. చైనా ఎన్నడూ చూడని విధంగా కారుతో పదుల మందిని తొక్కించి చంపడం, పోలీసులకు దొరికిన తర్వాత కత్తితో దాడి చేయడ లాంటి వాటిని చైనా కోర్టు తీవ్రంగా పరిగణించింది. నిందితుడిపై పక్కా ఆధారాలతో కఠిన చట్టాలపై కేవలం 2 నెలల వ్యవధిలో శిక్ష అమలు జరిగేలా చూసింది చైనా సర్కారు.