సుకన్య సమృద్ధి యోజన అంటేనే దేశవ్యాప్తంగా ఎందరో ఆడపిల్లలు, మహిళల్లో ఆశల్ని రేకెత్తించే.. సాధికారత పెంపొందించే పథకంగా చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్.. అంతలా జనాలకు చేరువైంది. 2015, జనవరి 22న ఈ పథకాన్ని ప్రారంభించగా.. గత నెల 22 నాటికి విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బేటీ బచావో, బేటీ పడావో క్యాంపెయిన్లో భాగంగా.. మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక సాధికారిత కల్పించడమే లక్ష్యంగా సుకన్య సమృద్ధి పథకం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు.. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పిల్లల పైచదువులు, పెళ్లి సమయానికి పెద్ద మొత్తంలో రాబడి అందించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశంగా ఉంది. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్కీమ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2024 నవంబర్ నాటికి ఏకంగా 4.1 కోట్లకుపైగా సుకన్య సమృద్ధి అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. సుకన్య సమృద్ధి యోజన పథకం కేవలం ఆడపిల్లల కోసమే ఉద్దేశించింది. పాప పుట్టిన సమయం నుంచి పదేళ్లు వచ్చే వరకు ఎప్పుడైనా ఇందులో చేరొచ్చు. ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరిట ఖాతాలు తెరవొచ్చు. ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ ఉన్నట్లయితే అప్పుడు రెండుకు మించి అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. భారత ప్రజలు అయి ఉండాలి. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
ఏమేం డాక్యుమెంట్లు కావాలి?
సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెనింగ్ ఫారం
అమ్మాయి బర్త్ సర్టిఫికెట్
ఐడెంటిటీ ప్రూఫ్ (RBI KYC గైడ్లైన్స్ ప్రకారం)
రెసిడెన్స్ ప్రూఫ్
ఎంత డిపాజిట్ చేయాలి?
పదేళ్ల వయసులోపు పాప పేరిట తల్లిదండ్రులు లేదా గార్డియెన్స్ ఖాతా తెరవొచ్చు. పోస్టాఫీస్ లేదా కమర్షియల్ బ్యాంకుల్లోకి వెళ్లి చేరొచ్చు. కనీసం ఆర్థిక సంవత్సరంలో రూ. 250 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్ట పెట్టుబడి రూ .1.50 లక్షల వరకు ఉంటుంది. అకౌంట్ తెరిచినప్పటి నుంచి వరుసగా 15 ఏళ్లు డబ్బులు కట్టాలి. సంవత్సరంలో ఒకేసారి లేదా ఇన్స్టాల్మెంట్ల రూపంలో చెల్లించొచ్చు.
వడ్డీ రేట్లు..
ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేటు జనవరి- మార్చి త్రైమాసికానికి గానూ 8.20 శాతంగా ఉంది. వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. వడ్డీ రేట్లు పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంది. ప్రతి నెలా వడ్డీ లెక్కించి.. ఆర్థిక సంవత్సరం చివర్లో అకౌంట్లో జమ చేస్తారు.
లాకిన్ పీరియడ్..
పదేళ్ల లోపు వయసులో ఎప్పుడు చేరినా కూడా.. ఆడపిల్లకు 18 ఏళ్లు దాటితే అకౌంట్ తానే స్వయంగా వినియోగించవచ్చు. ఈ పథకం లాకిన్ పీరియడ్ అకౌంట్ తెరిచినప్పటినుంచి 21 సంవత్సరాలు ఉంటుంది. ఇక పదో తరగతి పాసైనా లేదా 18 ఏళ్లు దాటినా 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. 18 ఏళ్లు నిండాక పెళ్లి సమయంలో అకౌంట్ ముందే క్లోజ్ చేయొచ్చు. ఐదేళ్ల వయసులో చేరినట్లయితే.. పాపకు 26 ఏళ్ల సమయంలో అకౌంట్ మెచ్యూర్ అవుతుందన్నమాట.
ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంతొస్తుంది?
ఈ పథకంలో చిన్న మొత్తాల్లో అంటే ఏడాదికి రూ. 5 వేలు, రూ. 10 వేల నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఎంతైనా మీ స్థోమతను బట్టి డబ్బులు జమ చేయొచ్చు. అయితే మనం నెలకు రూ. 5 వేలు, రూ. 10 వేలు, గరిష్టంగా రూ. 12,500 చొప్పున డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీకి ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఎంత వస్తుందో తెలుసుకుందాం.
నెలకు రూ. 5 వేలు, అంటే ఏడాదికి రూ. 60 వేల చొప్పున జమ చేస్తే.. 15 ఏళ్లకు మీ పెట్టుబడి రూ. 9 లక్షలపై వడ్డీ రూపంలోనే రూ. 18.71 లక్షలు వస్తాయి. మొత్తం మెచ్యూరిటీకి చేతికి రూ. 27.71 లక్షలు వస్తాయి.
ఇక నెలకు రూ. 10 వేల చొప్పున ఏడాదికి రూ. 1.20 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తే.. మొత్తం పెట్టుబడి రూ. 18 లక్షలపై మెచ్యూరిటీకి చేతికి రూ. 55.42 లక్షలు వస్తాయి.
గరిష్ట పెట్టుబడి రూ. 1.50 లక్షలు అంటే నెలకు రూ. 12,500 చొప్పున చూస్తే.. పెట్టుబడి మొత్తం రూ. 22.50 లక్షలు కాగా.. వడ్డీ రూపంలోనే రూ. 46.77 లక్షలు.. మెచ్యూరిటీకి మొత్తం చేతికి రూ. 69.27 లక్షలు వస్తాయి. అయితే పాప పుట్టిన సమయంలోనే ఏడాదిలోపే ఇందులో చేరడం ద్వారా.. అమ్మాయి పైచదువుల కోసం అదే విధంగా.. పెళ్లి సమయానికి 21 ఏళ్లు దాటగానే పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకోవచ్చు.
![]() |
![]() |