దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ మరో భారీ పెట్టుబడికి సిద్ధమైంది. ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో నిర్మించే రెండు 1000 పడకల ఆసుపత్రుల కోసం ఏకంగా రూ.6 వేల కోట్లు వెచ్చించనుంది అదానీ గ్రూప్. ఇటీవల తన చిన్న కుమారుడి వివహాం సందర్భంగా రూ.10 వేల కోట్ల విరాళం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. భవనాల నిర్మాణం, ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వైద్య విద్యను అందించేందుకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ తెలిపింది. తొలుత ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో రెండు ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపస్లను నిర్మించబోతున్నట్లు తెలిపింది.
భవిష్యత్తులో దేశంలోని ప్రముఖ నగరాల్లో మరిన్ని అదానీ హెల్త్ సిటీలు నిర్మిస్తామని ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే, ఎక్కడెక్కడ హెల్త్ సిటీలు నిర్మిస్తామనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఒక్కో క్యాంపస్లో 1000 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, క్లినికల్ రీసెర్చ్, ఏఐ టెక్నాలజీ, బయో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్ వంటివి ఉండనున్నాయని అదానీ గ్రూప్ తెలిపింది.
అపర కుబేరుడు గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం జరిగింది. సూరత్ వజ్రాల వ్యాపారీ జైమిన్ షా కుమార్తె దివా షాతో గత శుక్రవారం వివాహం జరిగింది. అహ్మదాబాద్లో బంధుమిత్రుల సమక్షంలో గుజరాతీ సంప్రదాయంలో ఈ జంట ఒక్కటైంది. ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో మౌలిక సదుపాయల కోసం రూ.10 వేల కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు గౌతమ్ అదానీ ప్రకటించారు. ఇందులో భాగంగానే రెండు 1000 పడకల ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించబోతున్నట్లు తాజాగా వెల్లడించారు.
![]() |
![]() |