రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుుకంది. దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది క్రితం కోటక్ బ్యాంకుపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24, 2024 రోజున ఈ మేరకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ కింద దఖలు పడిన అధికారాలతో కోటక్ మహీంద్రా బ్యాంకులో కొన్ని బిజినెస్ ఆంక్షలు విధించింది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోకూడదని, కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని తెలిపింది. ఇప్పుడు ఈ ఆంక్షలను ఎత్తివేయడంతో బ్యాంకుకు ఉపశమనం లభించినట్లయింది. ఇకపై ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు మార్గం సుగమమైంది.
'నిబంధనల ఉల్లఘనలు, సాఫ్ట్‌వేర్‌లో లోపలను సరిదిద్దేందుకు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంది. చేపట్టిన చర్యలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకుకు రిపోర్ట్ సమర్పించింది. సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఆర్‌బీఐ అనుమతితో ప్రత్యేక ఆడిట్ ప్యానల్ ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంకు లిమిటెడ్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ విషయంపై పూర్తి వివరాలను బ్యాంకుకు అందిస్తాం.' అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన చేసింది.
ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని, కొత్తగా క్రెడిట్ కార్డులు జారీ చేయవద్దని గతేడాది ఏప్రిల్‌లో ఆంక్షలు విధించగా ఇప్పటి వరకు కొనసాగించారు. 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి బ్యాంక్ ఐటీ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్‌బీఐ ఈ ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోతాయని కస్టమర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. అయితే, ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, క్రెడిట్ కార్డులను జారీ చేయడం నిలిచిపోయిందని, మిగితా సేవలు కొనసాగుతాయని బ్యాంక్ అప్పుడు భరోసా కల్పించింది. ఖాతాదారుల డబ్బు సురక్షితమేనని, అన్ని క్రెడిట్ కార్డు సేవలు కొనసాగుతాయని తెలిపింది. ఆ తర్వాత బ్యాంకు తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించింది. దిద్దుబాటు చర్యలను గుర్తించిన ఆర్‌బీఐ ఆంక్షలను ఎత్తివేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు ఎత్తివేసిన క్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ఫోకస్‌లోకి వచ్చింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు పడుతున్నా ఈ స్టాక్ కొనేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఓ దశలో 2 శాతానికిపైగా పెరిగింది. చివరకు మార్కెట్లు ముగిసే సమయానికి 1.40 శాతం లాభంతో రూ.1945.50 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1970.50 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ. 1543 వద్ద ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.3.86 లక్షల కోట్లుగా ఉంది.
![]() |
![]() |