మన దేశానికి దిగుమతి అవుతున్న చమురులో రష్యా నుంచే దాదాపు 40 శాతం ఉంటోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్‌కు రష్యా చమురు సరఫరా భారీగా పెరిగింది. తక్కువ ధరకే లభిస్తుండడంతో భారత్ ఎక్కువగా రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. అయితే, ఇప్పుడు ఈ రెండు దేశాల చమురు వాణిజ్యంపై ఓ పిడుగు పడింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో రష్యా నుంచి ఎగుమతులు భారీగా తగ్గిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ ప్రభావం భారత్‌పై ఉంటుందా? భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?
రష్యా చమురు రంగంపై అమెరికా కొత్త ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌కు సరఫరా అయ్యే ఆ దేశ చమురుపై ఉండకపోవచ్చని రష్యా తొలి డిప్యూటీ ఇంధన మంత్రి పావెల్ సోరోకిన్ పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలు చట్టవ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ' భవిష్యత్తులోనూ ఇండియాకు మా సహకారం ఉంటుంది. రాజకీయాల వల్ల ఇంధన వాణిజ్యం దెబ్బకూడదనేది మేము భావిస్తాం. ద్వైపాక్షిక, బహుళపాక్షిక పద్ధతుల్లో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాం.' అని రష్యా ఇంధన మంత్రి పావెల్ సోరోకిన్ పేర్కొన్నారు.
రష్యా చమురు ఉత్పత్తి సంస్థలు గాజ్‌ప్రోమ్ నెఫ్ట్, సర్గెట్‌నెప్ట్ గ్యాస్‌తో పాటు ఆ దేశం నుంచి చమురును సరఫరా చేస్తున్న 183 నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా రష్యా ఇంధన ఎగుమతులు తగ్గిపోతాయని, దీంతో ఉక్రెయిన్ పై ఆ దేశం చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులు తగ్గిపోతాయని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్ సహా ముఖ్య నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఓసారి తెలుసుకుందాం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.81 వద్ద ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 87.71 వద్ద ఉంది. ఇక ముంబైలో లీటర్ డీజిల్ రేటు రూ. 90.01 వద్ద ఉండగా.. లీటర్ పెట్రోల్ రేటు రూ. 103.49 వద్ద ఉంది. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.102.90 వద్ద ఉంది. లీటర్ డీజిల్ రేటు రూ.88.98 వద్ద ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే పెట్రోల్ లీటరుకు రూ. 107.45 వద్ద ఉండగా.. డీజిల్ లీటరుకు రూ. 95.69 వద్ద ఉంది.
![]() |
![]() |