ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లాండ్ ఓడిపోతుంటే డగౌట్‌లోనే నిద్రపోతావా జోఫ్రా ఆర్చర్

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 11:27 PM

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడిన ఇంగ్లాండ్.. దారుణంగా విఫలమైంది. ఐదు టీ20ల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలిచిన ఆ జట్టు.. మూడు వన్డేల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటతీరుపై ఇంగ్లాండ్ మాజీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా భారత్ లాంటి జట్టుతో ఆడేటప్పుడు.. ఇలాగే ప్రిపేర్ అవుతారా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో గెలవాలనే కసి కనిపించలేదని పలువురు మాజీలు విమర్శలు గుప్పించారు.


ఇక ఓ పక్క ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కొనసాగుతుండగానే.. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా.. ఆ వీడియోను చూసిన ఫ్యాన్స్.. ఇంగ్లాండ్‌ టీమ్‌ను తిట్టిపోస్తున్నారు. క్రికెట్ ఎందుకు ఆడతారయ్యా.. అని ప్రశ్నిస్తున్నారు.


ఆ వీడియోలో ఏముందంటే..


భారత్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా జరిగిన విషయం తెలిసింది. అయితే అప్పటికే రెండు మ్యాచులలో ఓడిపోయి.. సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో బరిలోకి దిగుతుందని.. గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ భారత్ ముందు ఆ జట్టు నిలవలేకపోయింది. ఏకంగా 142 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఇంగ్లాండ్‌కు 357 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే ఛేజింగ్‌లో ఇంగ్లాండ్.. తడబడింది. ఓ దశలో 154 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులో లియామ్ లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్‌లు ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. మ్యాచ్ జరుగుతుండగా డగౌట్‌లో నిద్రపోతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఇక ఈ వీడియోపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శలు గుప్పించాడు. "నిద్ర పోవడానికి ఇదే సరైన సమయం. ఈ సిరీస్ మొత్తం వారు ఇదే చేశారు" అని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటప్పుడు.. పర్యటనలకు రావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా నాలుగు టీ20లు, ఒక వన్డేలో ఆడిన ఆర్చర్.. కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com