ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేస్తోంది. ఈ నెల 19 నుంచి పాకిస్థాన్ వేదికగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని దేశాలు కూడా తమ జట్లను ప్రకటించాయి. కొన్ని జట్లయితే ఆతిథ్య పాకిస్థాన్‌లో ఇప్పటికే అడుగుపెట్టి.. ప్రాక్టీస్ ప్రారంభించాయి. వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్-8లో నిలిచిన జట్ల మధ్య ఈ పోటీ జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ మరో 5 రోజుల్లో ప్రారంభం కానుండగా.. ఐసీసీ ఈ టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలు శుక్రవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసింది. గతంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే.. ఏకంగా 53 శాతం ప్రైజ్‌మనీని పెంచింది. విజేత, రన్నరప్ సహా అన్నింటితో కలిపి మొత్తంగా రూ. 59 కోట్లను జట్లకు అందించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఛాపియన్‌గా నిలిచిన జట్టుకు ఏకంగా రూ. 20.8 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఆ తర్వాత రన్నరప్‌కు విజేత ప్రైజ్‌మనీలో సగం అంటే రూ. 10.4 కోట్లు దక్కనుంది.
ఇక సెమీ ఫైనల్ చేరిన మరో రెండు జట్లూ రూ. 5.2 కోట్ల చొప్పున అందుకుంటాయి. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 3 కోట్లు దక్కుతాయి. చివరి రెండు స్థానాలకు పరిమితమైన జట్లు ఈ టోర్నీ ద్వారా రూ. 1.2 కోట్లను ఆర్జించనున్నాయి. ఇక టోర్నీలో గెలిచే ఒక్కో మ్యాచ్‌కు ఆయా జట్టుకు అదనంగా రూ. 29 లక్షలను ఐసీసీ ముట్టజెప్పనుంది.
గత ఛాంపియన్స్ ట్రోఫీతో పోలీస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ. చివరగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఇందులో టైటిల్ సాధించిన పాకిస్థాన్‌కు రూ. 14.18 కోట్లు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన టీమిండియా రూ. 7 కోట్లు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్ చేరిన రెండు జట్లు రూ. 3 కోట్ల చొప్పున అందుకున్నాయి. ఇక ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 58 లక్షలు.. చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్లకు రూ. 39 లక్షలు అందాయి.
![]() |
![]() |