ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ విభాగానికి పీజీ విద్యార్థులు నూతన ఆవిష్కరణకు నాంది పలికారు. పీజీ చివరి సంవత్సరం చదువుతున్న ఆకెళ్ళ మైదిలి, సింగుపురం ఇందు సంయుక్తంగా ఒక నూతన మైలురాయిని సాధించారు. ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్న వీరు, స్త్రీల బహిష్టు (నెలసరి) సమయంలో వ్యర్థంగా పోయే రక్తాన్ని సేకరించారు. తొలి దశలో దీని నుంచి ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్స్‌ను వేరు చేశారు. రెండవ దశలో ఈ స్టెమ్ సెల్స్‌ను ఉపయోగించి త్రిజామితీయ (3D) ఆకారంలో ప్రింట్ చేయడం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నూతన ఆవిష్కరణకు ఏయూలో డాక్టర్ రవికిరణ్ యేడిది నిర్వహిస్తున్న టీకాబ్స్ ఈ (TCABS- E) లేబరేటరీ వేదికగా నిలిచింది. విద్యార్థులు ఈ నూతన ఆవిష్కరణ చేయడం పట్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శశిభూషణరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ.ఎన్. ధనుంజయరావులు అభినందనలు తెలియజేశారు. విద్యార్థి దశలోనే ఇటువంటి నూతన ఆవిష్కరణలకు స్థానం కల్పించడం పట్ల డాక్టర్ రవికిరణ్‌ను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులను ఆవిష్కర్తలుగా నిలుపుతూ మరిన్ని నూతన ఆవిష్కరణలకు స్థానం కల్పించాలని సూచించారు. విద్యార్థులు జరిపిన ఈ పరిశోధన విశ్వవిద్యాలయానికి ప్రత్యేకమైన గుర్తింపును అందిస్తుందని అన్నారు. వ్యర్థం నుంచి ధనం అనే సిద్ధాంతానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ పరిశోధన ఆవిష్కరణలు నిలుస్తున్నాయి. ఈ పరిశోధనను ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో త్రీడీ ఆకారంలో ఆర్గాన్లను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
![]() |
![]() |