రాష్ట్రంలో బలహీనవర్గాల బాలికల గురుకుల పాఠశాలలను 60 మంది పిల్లలతో ప్రారంభించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుర్తుచేశారు. ఎక్కడా లేని సౌకర్యాలు ఈ పాఠశాలల్లో కల్పించామని చెప్పారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో మంజూరైన రెండింటిలో ఒకటి ఆత్మకూరుకు వచ్చిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.29కోట్లు నిధులు మంజూరు చేశాయని ప్రకటించారు. ఆత్మకూరులో వందపడకల ఆస్పత్రిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి మంత్రి సత్యకుమార్ అంగీకరించారని అన్నారు. రెండు జాతీయ రహదారులను కలిపే ఆత్మకూరు - సోమశిల రోడ్డు, నెల్లూరుపాళెం - వింజమూరు, సంగం - కలిగిరి రోడ్లని అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రూ.25కోట్లతో ప్రతి పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. రూ.85కోట్లతో విద్యుత్తు సరఫరాకు అవసరమైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. లిప్ట్ ఇరిగేషన్ సిస్టంలు పునర్నిర్మాణాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఏపీలో రూ.10,50,000 కోట్ల అప్పులున్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధులు రూ.1200కోట్ల మేర స్వాహా చేశారని విమర్శించారు. ఎంపీటీసీలు, సర్పంచులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నా, మెరుగైన పాలన సాగిస్తామని ఉద్ఘాటించారు. NREGS, 15th ఫైనాన్స్ నిధులను రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు ఇస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
![]() |
![]() |