ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి రైతువ్యతిరేకి అని వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాడు వ్యవసాయం దండుగ అన్నాడు, నేడు ఏకంగా సాగునీటి కాలువలనే ప్రైవేటుపరం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేలను చంద్రబాబు కక్షసాధింపులో భాగంగా పూర్తిగా నిర్వీర్యం చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మిర్చి రైతులు రేటు లేక కన్నీరు పెడుతుంటే చంద్రబాబు దళారీలకు కొమ్ముకాస్తున్నడని ఆక్షేపించారు. కూటమి సర్కార్ అసమర్థత, నిర్లక్ష్యం, రైతు వ్యతిరేక విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైయస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. గత వైయస్సార్సీపీ పాలనలో రైతుల కోసం మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, ఆక్వాఫీడ్, సీడ్, సంపూర్ణ దాణా వంటి సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేల ద్వారా నిర్వహించారు. గిట్టుబాటు ధర కల్పించడం, నష్టం జరిగినప్పుడు పరిహారం చెల్లించడంలో ఆర్బీకేలు రోల్ మోడల్‌గా పనిచేశాయి. ఆర్బీకే సేవలను దేశంలో ఉన్న వివిధ రాష్ట్ర బృందాలు పరిశీలించడంతోపాటు ఇథియోపియో, వియత్నం వంటి దేశాల నుంచి బృందాలు వచ్చి పరిశీలించాయి. వారి దేశాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించాయి. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా ఉన్న ఫుండ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, నీతి అయోగ్, ఆర్బీఐ, ఐసీఐఆర్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలను ప్రశంసించాయి అని తెలిపారు.
![]() |
![]() |