ఓర్వకల్లు విమానాశ్రయానికి 'ఉయ్యాలవాడ' పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్ కు చేరుకుందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నాలుగేళ్ల క్రితమే నాటి సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైయస్ జగన్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అయన మాట్లాడుతూ.... తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డిసంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని, గతంలో ఈ మేరకు సీఎంగా పనిచేసిన వైయస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారంటూ చంద్రబాబుకు విన్నవించుకున్నారు. వెంటనే చంద్రబాబు చాలా అన్యాయం జరిగింది, ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరును పెడతానంటూ హామీ ఇచ్చేశారు. ఇదంతా కూడా అన్ని పత్రికలో పెద్ద ఎత్తున ప్రచురించారు. ఈ కథనంలో చంద్రబాబును కలిసిన ఆ రెడ్డి సంఘం ప్రతినిధులు ఎవరో కూడా వెల్లడించకుండా ఈనాడు పత్రిక జాగ్రత్త పడింది. నిత్యం వైయస్ జగన్ గారిపై బుదరచల్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు తాజాగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు అంటూ చేసిన హంగామా ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. గతంలోనే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరును ప్రకటించడంతో పాటు, అధికారికంగా ఉత్తర్వులు జారీ జారీ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. మార్చి 25, 2021న ఏపీ సీఎంగా వైయస్ జగన్ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తూ విమానాశ్రయానికి బ్రిటీష్ వారిపై పోరు సల్పిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. దీనిని అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాకుండా దీనిపై మే 16, 2021న నాటి వైయస్ జగన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 21ని విడుదల చేసింది అని తెలిపారు.
![]() |
![]() |