ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోవడం లేదని, వట్టి మాటలతో ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. డ్రోన్లు, ఏఐ వంటి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మనకు బలమైన పునాది కావాలని సూచించారు. డ్రోన్ సాంకేతికతను వివరిస్తూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు.''డ్రోన్లు యుద్ధరంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేశాయి. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్స్ జత చేయడంలో యుద్ధభూమితో కమ్యూనికేట్ అవుతున్నాయి. డ్రోన్లు కేవలం సాంకేతికత మాత్రమే కాదు.. బలమైన పారిశ్రామిక వ్యవస్థతో ఉత్పత్తి చేసిన ఆవిష్కరణలు. దీనిని గ్రహించడంలో ప్రధానమంత్రి మోదీ విఫలమయ్యారు. ఏఐపై ఆయన ప్రసంగాలకే పరిమితమవుతుంటే మన పోటీ దేశాలు మాత్రం కొత్త సాంకేతికతను సృష్టించి రాటుదేలుతున్నాయి. కొత్త సాంకేతికను అందిపుచ్చుకునేందుకు మనకు బలమైన పునాది కావాలి. వట్టి మాటలు కాదు'' అని రాహుల్ అన్నారు.దేశంలో ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మనం విఫలమవుతున్నామని రాహుల్ అన్నారు. ఈ దిశగా ఒక స్పష్టమైన వ్యూహం అవసరమని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, దేశాన్ని ముందుకు నడిపేందుకు దృఢమైన పారిశ్రామిక నైపుణ్యం అవసరమని సూచించారు.రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోలేకపోయిందని అన్నారు. అందువల్లే చైనా ఇక్కడ మకాం వేసిందని అన్నారు. ఇప్పటికైనా తయారీ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉందని సూచించారు. 'మేక్ ఇన్ ఇండియా' ఐడియా మంచిదే అయినా దాని ఫలితం కళ్లముందే ఉందన్నారు. 2014లో జీడీపీలో 15.3 శాతంగా ఉన్న మ్యాన్యుఫ్యాక్చరింగ్.. ఇవాళ 12.6 శాతంగా ఉందని, గత 60 ఏళ్లలో ఇది అత్యంత కనిష్టమని చెప్పారు. ప్రధానమంత్రిని తాను తప్పుపట్టడం లేదని, ఆయన ప్రయత్నించడం లేదని కూడా చెప్పనని, ఆయన ప్రయత్నించినా విఫలమయ్యారని చెప్పగలనని అన్నారు. ''మొబిలిటీలో మార్పులకు నాలుగు టెక్నాలజీలు ప్రధానం. ఎలక్ట్రిక్ మోటార్స్, బ్యాటరీస్, ఆప్టిక్స్, వాటన్నింటికంటే టాప్‌లో ఏఐ ఉంటాయన్నారు. ఏఐ గురించి మాట్లాడేటప్పుడు అది సొంత ఏఐ కాకపోతే దానికి అర్ధం లేదు. ఎందుకంటే అది డాటాపై ఆపరేట్ అవుతుంది. ఇవాళ మనం డాటాను చూస్తే, ప్రొడక్షన్ సిస్టమ్ నుంచి వచ్చే ప్రతి సింగిల్ డాటా చైనాదే'' అని రాహుల్ అన్నారు.
![]() |
![]() |