ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో తాను ఏకీభవించనని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, ప్రజాస్వామ్య దిశపై తాము ఆశాభావంతో జీవిస్తున్నామని చెప్పారు. ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు వేసినట్టు తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపించారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా భారత్‌లో జరిగాయని చెప్పారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకూ కొనసాగనున్న 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జైశంకర్ పాల్గొన్నారు. నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్, యూఎస్ సెనెటర్ ఎలిస్స స్లాట్కిన్, వార్సా మేయర్ రఫాల్ త్రాస్కోవ్స్కి సైతం ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు.వెస్ట్రన్ డెమోక్రసీపై జైశంకర్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండు వంతుల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 70 కోట్లకు పైగా ప్రజలు ఓటు వేశారని తెలిపారు. ఒకే రోజులో ఓట్లు లెక్కించామని వివరించారు. భారత్‌లో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవన్నారు. దశాబ్దం క్రితం కంటే 20 శాతం అధికంగా ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పారు. ''మేము చక్కటి జీవినం సాగిస్తున్నాం. ఓటింగ్ చక్కగా జరుగుతోంది. ప్రజాస్వామ్యంపై మేము ఆశావాద దిశగా పురోగమిస్తున్నాం. మా వరకూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది'' అని అన్నారు.ప్రజాస్వామ్యం మన అవసరాలు తీర్చదని యూఎస్ సెనెటర్ అభిప్రాన్ని జైశంకర్ తిప్పికొడుతూ, ప్రజాస్వామ్య భారత్‌లో 800 మిలియన్ల మందికి పోషకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సమర్ధవంతంగా పనిచేస్తుండగా, మరి కొన్ని ప్రాంతాల్లో సవాళ్లు ఎదురవుతున్న విషయాన్ని తాను అంగీకరిస్తానని అన్నారు. అన్ని ప్రాంతాలనూ ఒకే గాటన కట్టరాదని సూచించారు.
![]() |
![]() |