ఇటీవలి కాలంలో అమెరికాలో విమాన ప్రమాదాలు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విమానాల్లో సాంకేతిక లోపాలు, పేలిపోవడం, ల్యాండ్ అయ్యే సమయంలో అగ్ని ప్రమాదాలు జరగడం జరగడంతో ప్రయాణికులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. ల్యాండింగ్ సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. విమానం నుంచి దట్టమైన మంటలు, పొగ వ్యాపించాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికా ఎయిర్‌లైన్స్ విమానం.. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి డల్లాస్ ఫోర్‌కు వెళ్తుండగా.. ఆ విమానాన్ని డెన్వర్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. డెన్వర్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత.. ఆ విమానం నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. అప్పుడే దట్టమైన పొగ కూడా ఆ విమానం మొత్తం కప్పేసింది. విమానం నుంచి మంటలు, పొగ వ్యాపిస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రమాద సమయంలో ఆ విమానంలో 172 మంది ప్రయాణికులతోపాటు, ఆరుగురు అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఉన్నారు.
ఇక విమానంలో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఎమర్జెన్సీ విండో నుంచి విమానం రెక్కలపైకి చేరుకుని నిలుచున్నారు. దట్టంగా పొగ కమ్మేసిన ఆ విమానం నుంచి రెక్కల మీది నుంచి అందులోని ప్రయాణికులు బయటికి వస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఆ విమానం ల్యాండ్ అయిన తర్వాత గేటు వైపు వేగంగా దూసుకువచ్చిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే విమానంలోని ఇంజిన్‌లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ ఘటన తర్వాత విమానంలో ఉన్న మొత్తం 178 ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా ఎయిర్‌పోర్టు టర్మినల్‌కు చేర్చినట్లు అమెరికా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. విమానంలో ఎగిసిపడిన మంటలను ఎయిర్‌పోర్టులోని ఫైర్ సిబ్బంది ఆర్పేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. కానీ ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అమెరికా ఎయిర్‌లైన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
![]() |
![]() |