‘ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని విశ్వసిస్తున్నాం. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డిలో నిజాయితీ, చిత్తశుద్ధి లోపించింది. దీంతో కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం ఒంగోలు విచ్చేసిన ఆయన మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి మున్నంగి లక్ష్మయ్య(ఇటీవల చిన్నపాటి ప్రమాదం జరిగి, చేతికి గాయమైంది)ను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ... ‘మాదిగలతోపాటు, వర్గీకరణ కోరుకున్న దళిత కులాలకు చంద్రబాబుతో మేలు జరుగుతుంది. వర్గీకరణ చేసి, మరిన్ని ఫలాలు అందించాలన్న ఆయన ఆలోచనలను పరిణామాలు ప్రతిఫలిస్తున్నాయి. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టు అందగానే ఆ అంశంపై సీఎం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణకు నెలరోజుల్లోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు దక్కని మాదిగ, రెల్లి, ఇతర ఉపకులాలకు త్వరలోనే న్యాయం జరుగుతుంది. కాగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, నోటిఫికేషన్లు వర్గీకరణ పూర్తయిన తర్వాతనే అమలు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన ఎమ్మార్పీఎస్ నాయకులతో కొద్దిసేపు సమీక్షించారు.
![]() |
![]() |