రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల గుండెల్లో మహోన్నత మూర్తిగా కొలువైన స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి పేరును తొలగించడం ఈ ప్రభుత్వం వల్ల అవుతుందా అని ప్రశ్నించారు. వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, ఆయన పేరును అన్నిచోట్లా తొలగించడం వంటి దుర్మార్గమైన చర్యలు కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన మాట్లాడుతూ.... వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం కాదు, ఆయన పాలనతో పోటీ పడి ప్రజలకు మంచి చేయండి. అంతేకానీ ప్రజల ప్రేమాభిమానాలను అందుకున్న వైయస్‌ఆర్ ఆనవాళ్ళనే చెరిపేద్దామనే భ్రమలతో అరాచకం సృష్టిస్తే సహించేంది లేదు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 వంటి పథకాలతో వైయస్‌ఆర్ ఈ రాష్ట్రానికే కాదు దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయుడుగా నిలిచారు. ఆయా రాష్ట్రాల్లో వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను నేటికీ అమలు చేస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం బాపట్ల, నాగార్జున యూనివర్సిటీలో వైయస్ఆర్ విగ్రహాలను తొలగించారు. తాజాగా విశాఖ సమీపంలోని అంతర్జాతీయ స్టేడియంకు పెట్టిన వైయస్ఆర్ పేరును తొలగించేందుకు సిద్దమయ్యారు. వైయస్ఆర్ పాలనలో ఈ రాష్ట్రంలో క్రీడలకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహంను చూసి క్రీడాసంఘాలే ఈ స్టేడియంకు వైయస్ఆర్ పేరు పెట్టాయి. దీనిని కూడా రాజకీయ కోణంతో చూస్తూ, పేరును తొలగించేందుకు సిద్దమపడటం కూటమి ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనం. ఆఖరికి వైయస్ జగన్ గారి పాలనలో విజయవాడ నడిబొడ్డులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనంపైన కూడా దాడి చేశారు. వైయస్ జగన్ గారి పేరును ధ్వంసం చేశారు. స్థానికులు గమనించి అడ్డుకోకపోతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా అపవిత్రం చేసేవారు. ఈ రాష్ట్రంలో మహనీయుల పట్ల కూటమి పార్టీలకు ఎక్కడా గౌరవం లేదు అని మండిపడ్డారు.
![]() |
![]() |