పాకిస్థాన్ జైలులో భారతీయ మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జైలులోని బాత్రూంలో ఉరి వేసుకొని అతడు ప్రాణాలు తీసుకున్నట్లు జైలు సూపరింటెండెంట్ వెల్లడించినట్లు సమాచారం.భారత్-పాకిస్థాన్ జల సరిహద్దులపై సరైన అవగాహన లేక గౌరవ్‌రాం ఆనంద్ అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ అధికారులకు చిక్కాడు. అతడిని 2022లో పాకిస్థాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అప్పటి నుంచి అతడు కరాచీలోని జైలులో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లిన 52 ఏళ్ల గౌరవ్‌రాం ఆనంద్ తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ అతడు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జైలు అధికారి లోపలకి వెళ్లి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచనున్నట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు. కాగా, గత నెలలో పాక్ ప్రభుత్వం 22 మంది మత్స్యకారులను విడుదల చేసింది. వారి శిక్షాకాలం పూర్తి కావడంతో కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి వారిని విడుదల చేశారు.
![]() |
![]() |