ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని అన్నారు. 2027 నవంబరు నాటికే ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలే ముందే పునరావాస చర్యలు పూర్తవుతాయని తెలిపారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో వేసిన ఘనత తమది అని చంద్రబాబు ఉద్ఘాటించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు వస్తే ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు జగన్ కారణంగానే ఆలస్యమైందని విమర్శించారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయి ఉండేదని అన్నారు. పనులు ఆలస్యం కావడంతో పోలవరం వ్యయం భారీగా పెరిగిపోయిందని వెల్లడించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కనాడైనా జగన్ పోలవరంలో కనిపించారా? అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తాను సోమవారాన్ని పోలవరం వారంగా మార్చుకుని పనిచేశానని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి పోలవరం పనులపై దృష్టి సారించామని, వీలైనంత త్వరగా పరిహారం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కాగా, కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, అధికారులు కూడా పాల్గొన్నారు.
![]() |
![]() |