ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెరవేరబోతున్న కశ్మీరీల చిరకాల స్వప్నం.. వచ్చే నెలలోనే మోదీ చేతుల మీదుగా

national |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 07:46 PM

ప్రకృతి అందాలు.. హిమగిరుల సోయగాలు.. జలపాతాల హోయలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో భూతల స్వర్గంగా కశ్మీర్ అలరారుతోంది. హిమాలయ పర్వతాల నడుమ విరాజిల్లే కశ్మీర్.. అపురూప దృశ్యాలతో పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది. కశ్మీర్‌ అందాలను చూసేందుకు రెండు కళ్లు సరిపడవంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇప్పటి వరకూ దేశంలోని ఏ నగరం నుంచి నేరుగా కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు రైలు సౌకర్యం లేదు. ఇది కశ్మీరీవాసుల చిరకాల స్వప్నం. ఇక, వారి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. కశ్మీర్‌ లోయలో తొలిసారి పట్టాలపై రైలు పరుగులు తీయనుంది. ఏప్రిల్‌ 19 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కట్రా–శ్రీనగర్‌ రైలు సేవలను ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. ప్రస్తుతం సంగల్డాన్, బారాముల్లాతో పాటు కట్రాకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి రైలు సేవలు నడుస్తున్నాయి. మొదటిసారి మాతా వైష్ణోదేవి బేస్ క్యాంప్ (కట్రా) నుంచి కశ్మీర్‌కు రైలు అందుబాటులోకి రానుంది. పర్యాటకులు, యాత్రికులతో పాటు స్థానికులకు కనెక్టివిటినీ గణనీయంగా మెరుగుపరుస్తుంది.


కట్రా రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలును ఏప్రిల్ 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారు. అవసరమైన రక్షణ, భద్రతా చర్యలు, పలు ట్రయల్ రన్స్ అనంతరం కొత్త మార్గం ప్రారంభానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే కశ్మీరీ పర్యాటకులకు కొత్త అనుభూతితో పాటు వస్తువులు, సేవల వేగవంతమైన, మరింత సమర్థవంతమైన రవాణా ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.


కట్రా-శ్రీనగర్ రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ధ్రువీకరించారు. ఏప్రిల్ 19న ఉదయం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఉధమ్‌పూర్ ఆర్మీ విమానాశ్రయానికి చేరుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనంతరం రెసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిను సందర్శిస్తారు. అక్కడ నుంచి కట్రాకు చేరుకుని.. రైలుకు పచ్చజెండా ఊపుతారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఉధమ్‌పూర్ ఆర్మీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడ నుంచి న్యూఢిల్లీకి తిరుగు పయనమవుతారు.


ప్రస్తుతానికి కట్రా-బారాముల్లా మధ్య మాత్రమే రైలు సర్వీసులు నడుస్తాయి. జమ్మూ రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత జులై ఆగస్టులో జమ్మూ వరకూ రైలును పొడిగిస్తారని అధికారులు తెలిపారు. ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే అనుసంధానం ప్రాజెక్ట్ 2005-06లో ప్రారంభమైంది. దశల వారీగా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేస్తున్నారు. తొలి దశలో ఖజీగుండ్-బారాముల్లా మధ్య 118 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను పూర్తిచేసి.. 2009 అక్టోబరులో ప్రారంభించారు. అనంతరం బనీహల్-ఖజిగుండ్ మధ్య 18 కి.మీ., ఉధమ్‌పూర్ కట్రా మధ్య 25 కి.మీ. మార్గాలు 2013, 2014లో పూర్తిచేశారు.


అలాగే, గతేడాది ఫిబ్రవరిలో బనిహల్-సంగల్డాన్ మధ్య 48.1 కి.మీ. మార్గాన్ని ప్రారంభించారు. అలాగే, సంగల్డాన్-రెసీ మధ్య 46 కి.మీ. ట్రాక్ నిర్మాణం జూన్‌లో పూర్తి కాగా.. రెసీ-కట్రా మధ్య మిగతా 17 కి.మీ పూర్తిచేయడానికి మూడు నెలలు పట్టింది. అప్పటి నుంచి వందేభారత్ సహా పలు రైళ్ల ట్రయల్ రన్ నిర్వహించారు. మొత్తం 272 కి.మీ... 38 సొరంగాలతో ఉద్ధమ్‌పూర్ బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్ట్‌‌ చేపట్టారు. ఇందులో అతిపెద్ద రైల్వే సొరంగం టీ 40 12.75 కి.మీ. పొడవు. ఇది దేశంలో అతిపెద్ద రైల్వే సొరంగం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com