మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ఆయా దేశాల్లోని పెద్ద పెద్ద భవనాలు, నివాసాలు పూర్తిగా ధ్వంసం కాగా.. చెట్లు సైతం నాశనం అయ్యాయి. అయితే తాజాగా ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌ల దేశాల్లో భూకంప పరిస్థితిపై ఆందోళనకరంగా ఉందని చెప్పారు. అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఆయా దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు..
శుక్రవారం రోజు మధ్యాహ్నం 12.50 గంటల ప్రాంతంలో మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూగర్భ శాస్త్ర సర్వే (USGS) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం 7.7 తీవ్రతతో నమోదు అయింది. దీని కేంద్రబిందువు సగైంగ్ పట్టణానికి 16 కి.మీ ఉత్తర-వాయవ్య దిశలో.. భూమికి 10 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వివరించింది. దీని ధాటికి దేశంలోని అనేక భవనాలు, నివాసాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చూస్తుండగానే ఇళ్లన్నీ పేక ముక్కల్లా పడిపోగా.. ప్రజలంతా కన్నీరు మున్నీరు పెడుతున్నారు. అలాగే ప్రాణాలు కాపాడుకునేందుకు తీసిన పరుగులు గుర్తుకు చేసుకుంటూ భయపడిపోతున్నారు.
కేవలం మయన్మార్‌లో మాత్రమ కాకుండా దాని పొరుగు దేశం థాయ్‌లాండ్ రాజధాని నగరం బ్యాంకాక్ పట్టణంలోనూ.. పెద్ద ఎత్తున భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కదలగా అక్కడి భనవాలు, ఇళ్లు, చెట్లు అన్నీ కూలిపోయాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు భవనాలను ఖాళీ చేశారు. అయితే ఈ రెండు దేశాల్లోనూ భారీ భూకంపం సంభవించగా... ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదు. కానీ ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
రెండు దేశాలు భూకంప ధాటికి అల్లకల్లోలం కాగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూనే.. భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందని చెప్పారు. ఆయా దేశాల ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. సహాయక చర్యలపై ఆయా దేశాల ప్రభుత్వాలతో క్షణక్షణం సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరినట్లు వెల్లడించారు. అలాగే ఆ దేశాలకు ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
![]() |
![]() |