ఫెడరల్ ఉద్యోగుల పనితీరు గురించి నివేదిక కోరుతూ గత నెలలో ఎలాన్ మస్క్ పంపిన మెయిల్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ విధేయులను ఫెడరల్ HR ఏజెన్సీలో తాజాగా నియమించారు. గత వారం పనితీరుకు సంబంధించిన ఐదు ముక్కల్లో వివరణ ఇవ్వవాలని కోరుతూ ఫిబ్రవరిలో మస్క్ మెయిల్ పంపడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ విధేయలుగా ముద్రపడ్డ బిల్లీ లాంగ్, గతంలో సహాయకుడిగా పనిచేసిన డగ్లస్ హోల్షర్‌లను ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ లో సీనియర్ సలహాదారులుగా నియమించారు. ప్రభుత్వంలో పారదర్శకత, ఆర్ధిక దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ (డోజ్)ను ఏర్పాటుచేసిన ట్రంప్.. దాని బాధ్యతలను మస్క్‌కు అప్పగించారు. దీని ద్వారా ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు.
రాయిటర్స్ ప్రకారం.. ఈ నెల ప్రారంభంలోనే బిల్లీ లాంగ్, హోల్డర్లు బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగులకు పంపిన మెయిల్‌ను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన మస్క్.. తన లేఖకు స్పందించని ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రంప్ క్యాబినెట్‌లో కూడా దీనిపై చర్చ జరిగింది. వైట్‌హౌస్ అధికారులు ఈ మెయిల్‌ను ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో తాను అనుకున్నది సాధించడానికి ఓపీఎంలో తన విధేయులైన లాంగ్,హో ల్షర్ నియమించినట్లు తెలిపింది.
దీనిపై మస్క్‌తో పాటు హోల్షర్, లాంగ్ ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే, అధ్యక్షుడి ఎజెండాను అమలు చేయడానికి యంత్రాంగం కట్టుబడి ఉందని వైట్‌హౌస్ ప్రతినిధి అన్నారు. జనవరి 20న రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ప్రభుత్వ విభాగాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మస్క్ సాయం తీసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ పాలనలో మస్క్ జోక్యం పెరిగిపోయిందనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మస్క్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా ఉందని, ఆయన చేతిలో ట్రంప్ కీలుబొమ్మగా మారిపోయాడని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు. అయితే, మస్క్ మెయిల్‌కు స్పందించాల్సిన అవసరం లేదంటూ ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ తన ఉద్యోగులకు స్పష్టం చేశారు.
ఎఫ్‌బీఐ సిబ్బందికి సమాచారం కోరుతూ యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి ఈ-మెయిల్ వచ్చి ఉండొచ్చు... సంస్థ ఉద్యోగుల సమీక్ష ప్రక్రియకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కార్యాలయం బాధ్యత వహిస్తుంది...ఎఫ్భీఐ విధానాలకు అనుగుణంగా సమీక్షలను నిర్వహిస్తుంది.. ఒకవేళ మరిన్ని వివరాలు అవసరమైతే మిమ్మల్ని మేము సమన్వయం చేసుకుంటాం.. ప్రస్తుతానికి దయచేసి ఏవైనా మెయిల్స్‌కు స్పందించవద్దు..’’ అని కాష్ పటేల్ ఎఫ్‌బీఐ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నారు.
![]() |
![]() |