మయన్మార్ కేంద్రంగా సంభవించిన శక్తివంతమైన భూకంపం పట్ల అమెరికా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూకంపం తీవ్రత, దాని ప్రభావం రెండేళ్ల క్రితం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం మాదిరిగానే ఉండవచ్చని వారు అంచనా వేశారు. అధిక జనసాంద్రత కలిగిన మయన్మార్, థాయ్‌లాండ్ ప్రాంతాలలో సంభవించిన ఈ విపత్తును 'రెడ్ ఈవెంట్'గా పరిగణిస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, శుక్రవారం ఒక్కరోజే ఆరు భూకంపాలు సంభవించాయి, వీటిలో అత్యంత తీవ్రమైనది 7.7గా, అత్యల్పమైనది 4.3గా నమోదయ్యాయి. దీనిపై అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) సంస్థ స్పందించింది. ఈ భూకంపంలో భారీ ప్రాణనష్టం నమోదు అయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. టర్కీ, సిరియాలో రెండేళ్ల కిందట 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 53 వేల మందికి పైగా మరణించారని వెల్లడించింది. ఇవాళ సంభవించిన భూకంపం 7.7 తీవ్రత కలిగి ఉన్నందున, జన నష్టం కూడా ఆ స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని యూఎస్ జీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల దాని తీవ్రత ఎక్కువగా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది.భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో మయన్మార్ ఒకటి అని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్త బ్రియాన్ బాప్టై పేర్కొన్నారు. ఇక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్య 1200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. గత వందేళ్లలో మయన్మార్‌లో 6 కంటే ఎక్కువ తీవ్రతతో 14 భూకంపాలు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
![]() |
![]() |