బెంగళూరులో 36 ఏళ్ల టెక్కీ తన భార్యను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి పుణేకు పారిపోయాడు. అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన బెంగళూరులోని దొడ్డకన్నహళ్లి ప్రాంతంలో జరిగింది.మృతురాలిని 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్ గా, నిందితుడ్ని రాకేష్ రాజేంద్ర ఖేడేకర్‌గా గుర్తించారు. ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. గత సంవత్సరం నుంచి ఈ జంట బెంగళూరులో నివసిస్తోంది.బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేస్తుండగా గొడవ మొదలైంది. గౌరీ కోపంతో రాకేష్‌పై కత్తి విసరడంతో అతనికి గాయాలయ్యాయి. దీంతో రాకేష్ అదే కత్తితో ఆమెపై దాడి చేసి అక్కడికక్కడే చంపేశాడు.గురువారం నాడు గౌరీ మృతదేహం సూట్‌కేసులో కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం, బాధితురాలి మెడ, పొట్టలో అనేకసార్లు కత్తితో పొడిచినట్టు గుర్తించారు. అనంతరం ఆమె శరీరాన్ని ఎనిమిది నుంచి పది ముక్కలుగా నరికి సూట్‌కేసులో కుక్కాడు."ఈ దంపతులు మహారాష్ట్రకు చెందినవారు, ఒక సంవత్సరం క్రితం బెంగళూరుకు వచ్చారు. సూట్‌కేసులో మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. మహిళ మాస్ మీడియాలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. నిందితుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతను ఇంటి నుంచి పనిచేస్తున్నాడు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా తెలిపారు.రాకేష్ నేరం చేసిన తర్వాత గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను చేసిన పనిని గురించి చెప్పాడు. దీంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. వారు కర్ణాటక పోలీసులకు తెలియజేశారు."వివాహ వివాదాలే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది" అని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద్ తెలిపారు.నేరం చేసిన తర్వాత రాకేష్ బెంగళూరు నుంచి పారిపోయాడు. కాల్ డేటా రికార్డులు, డిజిటల్ నిఘా ద్వారా పుణేలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం అతడు పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాకేష్ కోలుకున్న తర్వాత బెంగళూరుకు తీసుకురానున్నారు. పోలీసు బృందం పుణేకు బయలుదేరింది.
![]() |
![]() |