నోట్ల కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కోలీజియం చేసిన సిఫారసుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆయనకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన విధులూ కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు.. జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్లకట్టలు కనిపించిన నేపథ్యంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఆదేశించాలంటూ న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపర వేసిన పిల్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కొలీజియం నియమించిన త్రిసభ్య కమిటీ జరుపుతున్న అంతర్గత విచారణ పురోగతిలో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అంతర్గత విచారణ అనేది దర్యాప్తు సంస్థలు జరిపే నేర దర్యాప్తునకు పత్ర్యామ్నాయం కాదని, అసలు అది కోర్టు పని కాదని, దాన్ని పోలీసులకు వదిలేయాలని న్యాయవాది నెడుంపర వాదించారు. దీంతో.. ‘‘అంతర్గత విచారణ పూర్తి కానివ్వండి’’ అని జస్టిస్ ఓకా సమాధానమిచ్చారు.
![]() |
![]() |