కోడిగుడ్లు అమ్ముకునే వ్యక్తికి ఐటీ శాఖ కోట్లలో నోటీసులు పంపింది. రూ. 6 కోట్లు జీఎస్టీ చెల్లించాలని డిమాండ్ చేసింది. పళ్ల రసాలు అమ్ముకునే మరో వ్యక్తికి కూడా ఇలాంటి నోటీసు వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల వ్యాపారం చేశారని ఆ నోటీసుల్లో పేర్కొనడంతో సదరు చిరువ్యాపారులు నోరెళ్లబెట్టారు. పొట్టకూటి కోసం చిన్న వ్యాపారం చేసుకునే తమను కోట్లల్లో పన్ను కట్టమంటే ఏంచేసేమని వాపోతున్నారు. మధ్యప్రదేశ్ లో ఐటీ అధికారుల నిర్వాకం ఇది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దామో జిల్లాకు చెందిన ప్రిన్స్ సుమన్ స్థానికంగా కోడిగుడ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఐటీ శాఖ నుంచి తనకు నోటీసులు అందాయని, అందులో జీఎస్టీ బకాయిలు రూ.6 కోట్లు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారని తెలిపారు.ఆ నోటీసులపై ‘ప్రిన్స్ ఎంటర్ ప్రైజెస్’ కంపెనీ పేరుందని వివరించారు. 2022లో ఢిల్లీ చిరునామాతో ఈ కంపెనీ ప్రారంభించినట్లు అధికారుల నోటీసుల ద్వారా తెలిసిందన్నారు. తోపుడు బండి మీద కోడిగుడ్లు అమ్ముకునే తాను ఓ కంపెనీకి యజమాని అవడమేంటని, రూ.కోట్లల్లో పన్ను చెల్లించమనడం ఏంటని వాపోయారు. నిజంగా తనకు రూ.50 కోట్లు ఉంటే నిత్యం తిండి కోసం ఇలా రోడ్డుమీద తిప్పలు పడాల్సిన అవసరం ఏముందని ప్రిన్స్ సుమన్ ప్రశ్నించారు. అయితే, సుమన్ గుర్తింపు కార్డు, ఇతర వ్యక్తిగత గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి తన క్లయింట్ పేరుతో ఎవరో కంపెనీ ప్రారంభించారని సుమన్ తరపు న్యాయవాది తెలిపారు.ఉత్తరప్రదేశ్ కు చెందిన పళ్ల రసాలు అమ్ముకునే చిరు వ్యాపారి ఎండీ రహీస్ కు కూడా ఇలాంటి నోటీసే వచ్చింది. బకాయిపడ్డ జీఎస్టీ రూ.7.5 కోట్లు వెంటనే చెల్లించాలని ఐటీ అధికారులు ఆ నోటీసులలో పేర్కొన్నారు. చిరు వ్యాపారం చేసుకునే తాను అంత డబ్బు జీవితంలో ఎన్నడూ చూడలేదని రహీస్ చెప్పారు. ఈ విషయంపై ఐటీ శాఖ అధికారులను సంప్రదించగా.. వ్యక్తిగత గుర్తింపు పత్రాలు ఎవరికిచ్చావని ప్రశ్నించారని, తనకు తెలిసి వాటిని ఎవరికీ ఇవ్వలేదని రహీస్ తెలిపారు. అయితే, ప్రాథమిక పరిశీలనలో రహీస్ పేరు, గుర్తింపు పత్రాలతో 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు తెలిసిందని అధికారులు వెల్లడించారు.
![]() |
![]() |