డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ప్రతిరోజూ పిఠాపురం వార్తల్లో నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ దూరంగా ఉంటున్నారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం పిఠాపురం మండలం కుమారపురంలో నాగబాబు పర్యటించారు.
గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొనగా.. రెండు పార్టీల శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. జనసైనికులు జై జనసేన అని నినాదాలు చేస్తే.. టీడీపీ కార్యకర్తలు జై టీడీపీ, జై వర్మ అంటూ పోటాపోటీ నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే నాగబాబు పర్యటనలో ఈ నినాదాల వ్యవహారం ఇదేమీ తొలిసారి కాదు. శుక్రవారం కూడా నాగబాబు సభలో ఇలాంటి నినాదాలు వినిపించాయి.
మరోవైపు ఎమ్మెల్సీ నాగబాబు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో పర్యటించారు. అక్కడ అన్నా క్యాంటీన్‌కు నాగబాబు శంకుస్థాపన చేశారు. అక్కడ కూడా ఇలా పోటాపోటీ నినాదాలు నడిచాయి. ఇదే సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరు లేదంటూ నెట్టింట టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
శిలాఫలకంపై సీఎం చంద్రబాబు పేరు లేకపోవటం ఏమిటని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం కూడా టీడీపీ, జనసేన మధ్య సోషల్ మీడియా వార్‌కు కారణమవుతోంది. మంగళగిరిలో నారా లోకేష్ జనసేన నేతలను వెంట బెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని.. పిఠాపురంలో వ్యవహారం మరోలా ఉందని.. ఇదేనా పొత్తు ధర్మం అంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.
మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో సొంతంగా పర్యటిస్తూ, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ ఇదే సమయంలో నాగబాబు పర్యటనకు కూడా దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు నాగబాబు పర్యటనలో వర్మ మద్దతుదారులు నినాదాలు, పోటీగా జనసేన నినాదాలతో పిఠాపురంలో కూటమిలో లుకలుకలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్టానాలు జోక్యం చేసుకోవాలని స్థానిక నేతలు కోరుతున్నారు.
![]() |
![]() |