దేశ వ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతున్నారని వైయస్ఆర్‌సీపీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్దమైన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లింల పట్ల తన వ్యతిరేక వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయ్యిందని ధ్వజమెత్తారు.అయన మాట్లాడుతూ.... ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పులు చెప్పుకునే చంద్రబాబు ముస్లింలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోవడం ఘోరం. ముస్లిం సమాజం మొత్తం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒకపక్క బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు ఏకపక్షంగా మద్దతు తెలిపిన చంద్రబాబు, సవరణలు సూచించామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ముస్లిం సమాజంలో వక్ఫ్ భూమి అంటే అల్లాకు చెందిన భూమి అని అర్థం. గడిచిన వందేళ్లుగా ఎంతోమంది దాతలు ముస్లింల సమాజ ఉద్ధరణ కోసం మంచి మనసుతో సేవాభావంతో దానమిచ్చిన భూమి అది. ఇది ప్రభుత్వ భూమి కాదు. ఈ భూమితో ప్రభుత్వానికి సంబంధం లేదు అని అన్నారు.
![]() |
![]() |