ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను నేర్పించేందుకు ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఏపీలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా ముగిసింది. మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఈఎఫ్) శిక్షణ అందించింది. గతేడాది దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. ఈమేరకు సమగ్రశిక్ష, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ, క్వస్ట్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా ఉపాధ్యాయులు, 7,381 మంది విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులలో నేర్పించింది. ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులను గుర్తించి విశాఖపట్నంలో హ్యాకథాన్‌ను నిర్వహించారు. విజేతలకు ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు, టీవీలను బహుమతులుగా ఇచ్చి ప్రోత్సహించారు. కాగా, రాబోయే మూడు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది ఉపాధ్యాయులకు, 50 వేల మంది విద్యార్థులకు ఏఐ, కోడింగ్ నైపుణ్యాలను నేర్పించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏఈఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త మాధవీలత తెలిపారు.
![]() |
![]() |