పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీలో 1.5 శాతం వృద్ధి కనిపిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు ఉంటాయన్న ప్రచారంపై ఆమె స్పందించారు. చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఈ మొత్తం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 4.5 లక్షల కోట్లు అందుతాయని అన్నారు. జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు ఈ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.2034 తర్వాతే జమిలి ఎన్నికలు ఉంటాయని, ప్రస్తుతం వాటికి పునాది మాత్రమే పడిందని నిర్మలా సీతారామన్ అన్నారు. జమిలి ఎన్నికలపై ఎన్నోసార్లు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ మాత్రమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకురాలేదని, 1960 నుంచి ఈ అంశంపై చర్చ జరుగుతోందని స్పష్టం చేశారు. జమిలిని గుడ్డిగా వ్యతిరేకించేవారు, దాని ప్రయోజనాలు తెలుసుకొని మద్దతిస్తే దేశానికి మేలు జరుగుతుందని నిర్మలా అన్నారు. గతంలో దివంగత కరుణానిధి జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చారని, ఆయన కుమారుడు స్టాలిన్ మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఆమె విమర్శించారు.
![]() |
![]() |