ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలోని ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య

national |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 02:08 PM

తక్కువ పనితీరు కనబరుస్తున్న కొందరు ఉద్యోగులకు ఓ ప్రైవేటు కంపెనీ విధించిన శిక్షపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలోని కలూర్‌కు చెందిన ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులపై అమానవీయంగా ప్రవర్తించింది. ఉద్యోగుల మెడకు కుక్క గొలుసులు కట్టి వారిని మోకాళ్లపై నడిపించి, నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయించింది. టీవీ చానళ్లలో ఈ దృశ్యాలు ప్రసారం కావడంతో సదరు కంపెనీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన కేరళ కార్మికశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి ఆ కంపెనీపై విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అయితే, కంపెనీ మాత్రం దీనిని కొట్టిపడేసింది. టీవీ ఫుటేజీలో కనిపించిన ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. తమ కంపెనీలో అలాంటి వేధింపులు జరగలేదని, ఆ దృశ్యాలు ఇప్పటివి కావని, కొన్ని నెలల కిందటివని చెప్పారు. అప్పట్లో మేనేజర్‌గా ఉన్న వ్యక్తి బలవంతంగా అలా చిత్రీకరించారని, యాజమాన్యం ఆయనను తొలగించిందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు కావాలనే ఆ వీడియోలను బయటపెట్టారని వివరించారు. కార్మికశాఖ, పోలీసుల ముందు కూడా ఆయన ఇదే వాంగ్మూలం ఇచ్చారు. అయితే, మరికొందరు ఉద్యోగులు మాత్రం లక్ష్యాలను సాధించడంలో విఫలమైన వారికి మాత్రం ఇలాంటి శిక్షలు విధించడం నిజమేనని చెప్పారు. సంస్థ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను ఖండించినట్టు పోలీసులు తెలిపారు. హైకోర్టు న్యాయవాది ఫిర్యాదుతో రాష్ట్ర మానవహక్కుల సంఘం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com