ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా ఆమె కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు హోంమంత్రికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో అనిత కుటుంబం స్వామివారి సేవలో పాల్గొంది. మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు హోంమంత్రికి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు.శ్రీరామనవమి రోజు శ్రీవారిని దర్శించుకోవడం తనకు దక్కిన అదృష్టమని ఆమె అన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ:సంతోషాలతో ఉండాలని తిరుమలేశుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. విజన్- 2047, పీ-4 విధానంతో రాష్ట్ర ప్రజలను సంపన్నులుగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.
![]() |
![]() |