ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటనతో టీడీపీ, జనసేన విభేదాలు బహిర్గతమయ్యాయి. నాగబాబు పర్యటనకు టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో కూటమి నేతల మధ్య పంచాయితీ ముదురుతోంది. టీడీపీ వర్సెస్ జనసేన యవ్వారం రోజురోజుకూ అదుపు తప్పుతోంది. మరో 15 ఏళ్లపాటు టీడీపీ, జనసేన, బీజేపీ బంధం ఒక్కటిగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు చెప్తున్నప్పటికీ.. పిఠాపురంలో క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఛాన్సు దొరికితే చాలు.. టీడీపీ, జనసేన నేతలు బలప్రదర్శనకు దిగుతున్నారు. ఇదెంతవరకూ వచ్చిందంటే జనసేన నేత ఫిర్యాదుపై టీడీపీ నేతలపై కేసులు నమోదైనట్లు సమాచారం. పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా పిఠాపురం వెళ్లిన ఆయన రెండు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అయితే ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా పలుచోట్ల టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వాగ్వాదం, బలప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే తనను దూషించారంటూ ఓ జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు చినజగ్గంపేటకు చెందిన టీడీపీ నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శుక్రవారం, శనివారం పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. కుమారపురంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి నాగబాబు వెళ్లగా.. టీడీపీ కార్యకర్తలు హంగామా చేశారు. నాగబాబు పాల్గొన్న కార్యక్రమంలో జైవర్మ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నినాదాలు కాస్తా నెట్టుకునే వరకూ వెళ్లింది.
అయితే నాగబాబు పాల్గొంటున్న కార్యక్రమాలకు, ప్రభుత్వం తరుపున చేపడుతున్న శంకుస్థాపనలకు.. టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వనం లేకపోవడంతో ఈ రగడ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాగబాబు పర్యటనకు వర్మను ఆహ్వానించకపోవటంతో పాటుగా.. ఇటీవల జరిగిన జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా పిఠాపురం టీడీపీ శ్రేణులలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తానే కారణమని ఎవరైనా అనుకుంటే వారి ఖర్మ అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెను దుమారం చెలరేగింది. పిఠాపురం టీడీపీ ఇంఛార్జిగా ఉన్న వర్మ.. పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారని, కానీ పొత్తు ధర్మం మరిచి నాగబాబు వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.
![]() |
![]() |