ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమె గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. కిమ్ మృతితో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కిమ్ గతంలో బహ్రెయిన్‌లోని మనామాలో నివసించేవారు. 2022లో కూడా ఆమె ఇలాంటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో బహ్రెయిన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత ఆమెను ముంబయికి తీసుకువచ్చారు. మార్చి 24న కిమ్ ఫెర్నాండెజ్‌కు గుండెపోటు రావడంతో ఆమెను ముంబయి లీలావతి ఆసుపత్రిలో ఐసీయూలో చేర్చారు. అయితే ఇవాళ తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు విడిచారు. కాగా, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆసుపత్రికి వెళ్లి జాక్వెలిన్ ను పరామర్శించారు. మార్చి 26న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జాక్వెలిన్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, తల్లికి అనారోగ్యం కారణంగా ఆమె ఆ ప్రదర్శనను రద్దు చేసుకున్నారు.కిమ్ ఫెర్నాండెజ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జాక్వెలిన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
![]() |
![]() |