రాష్ట్రంలో కూటమి నేతల చేతుల్లో ఆక్వారంగం ఉండటంతో ఇష్టారాజ్యంగా వారు ఆక్వారైతులను దోచుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు ఆక్వాసంస్థలను అడ్డం పెట్టుకుని సిండికేట్‌గా మారి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టారీఫ్ ల సాకుతో ఆక్వా రేట్లను గణనీయంగా తగ్గించివేశారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కూటమి నేతలకే కొమ్ము కాస్తోందని అన్నారు. అయన మాట్లాడుతూ.... ఆక్వా ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. దేశంలో మత్స్య ఉత్పత్తి 1.84 లక్షల టన్నులుంటే అందులో మెజారిటీ వాటా 51 లక్షల టన్నులు ఏపీ నుంచే ఉంటోంది. ఇందులో 76 శాతం రొయ్యలు, 24 శాతం చేపలు ఉత్పత్తి ఉంది. భారతదేశంలో వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిలో వచ్చే ఆదాయంలో 10 శాతం ఆక్వా ఉత్పత్తుల ద్వారా లభిస్తోంది. ఇలాంటి ఆక్వా రంగంలో రైతులు కుదేలైపోతుంటే కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ధరలు తగ్గిపోతుంటే కనీసం మాటసాయం చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది రైతులు ఆక్వారంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి బాగోగులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ఫీడ్, సీడు, గిట్టుబాటు ధర విషయంలో రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. గడిచిన పది రోజులుగా అమెరికాలో నెలకొన్న పరిస్ధితులు నేపథ్యంలో పంటను కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు. ఒకేసారి ధర రూ. 40 నుంచి 50 లకు పడిపోవడంతో ఆక్వా రైతుల పరిస్ధితి దిక్కుతోచని విధంగా తయారైంది. ఫీడు, సీడు, ఉత్పత్తి, సరఫరా విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా, ధరలు పెరిగినా అంతిమంగా ఆ భారం పండించే రైతు మీదనే పడుతోంది. దాన్ని నియంత్రించాలన్న కనీసం జ్ఞానం ప్రభుత్వానికి లేదని అన్నారు.
![]() |
![]() |