రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడడంతో, అది పేద రోగులకు శాపంలా మారిందని, హూబ్రిడ్ మోడల్‌తో పథకాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ తీరు దారుణమని వైయస్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. కేవలం 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని నిర్వీర్యం చేసిందని పలాసలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆక్షేపించారు.ఆయన మాట్లాడుతూ..... రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని సీఎం చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను ఆపేసి ప్రజలకు ఒక గొప్ప కానుక ఇచ్చింది. దివంగత వైయస్సార్ 20 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం చంద్రబాబు కారణంగా ఆగిపోయింది. రూ.3500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించని కారణంగా వైద్యం చేసేందుకు నెట్‌వర్క్ ఆస్పత్రులు అంగీకరించడం లేదు. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) నెల ముందే నోటీస్ ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరపలేదు. నిజానికి బకాయిల కోసం ‘ఆశా’ ప్రతినిధులు ఈ ప్రభుత్వానికి ఏకంగా 26 సార్లు లేఖ రాశారంటే, ప్రభుత్వ తీరు ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతోంది. వాస్తవానికి 3 నెలల నుంచే ఆరోగ్యశ్రీలో ఆస్పత్రులు చాలా వైద్య సేవలు నిలిపివేశాయి. ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీలో ఓపీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)తో పాటు, అన్ని రకాల నగదు రహిత సేవలు నిలిపి వేశాయి. ఇప్పుడు మొత్తం వైద్యసేవలు ఆపేశాయి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామంటూ ఈరోజు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అదే వైద్య రంగంలో కీలకమైన ఆరోగ్యశ్రీ సేవలు నిల్చిపోవడంపై మాట్లాడకుండా, కేవలం ఆ బిల్లుల ప్రస్తావన తెచ్చారు. అది కూడా ఆ బిల్లులు చెల్లించడానికి ఫైనాన్స్ సెక్రటరీ చేతులెత్తేశాడని నవ్వుతూ చెప్పాడం చూస్తే పథకం అమలుపై ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని వాపోయారు.
![]() |
![]() |