ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

national |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 08:03 PM

దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన నిఘా సంస్థలు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని తెలిపాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశారు. డ్రోన్లతో, ఐఈడీలతో దాడులు జరగవచ్చని హెచ్చరించారు. సముద్ర, నదీ మార్గాల ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ముంబయి 26/11 ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తున్న సమయంలో ఈ హెచ్చరికలు రావడం గమనార్హం.


  పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే శాఖను అప్రమత్తం చేస్తూ.. డ్రోన్లు, ఐఈడీల ద్వారా దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపాయి. 26/11 దాడుల సమయంలోనే 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయిలోకి ప్రవేశించారు. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్‌ మొదలైన ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. మూడు రోజుల వరకు ఈ మారణహోమం కొనసాగింది. ఈ దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నాటి దాడిలో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు.


ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులను చొరబాటు ప్రయత్నాలు భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు మరణించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. 9 పంజాబ్‌ రెజ్మింట్‌కు చెందిన జవాన్ కుల్దీప్ చంద్ అమరుడైనట్టు ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్‌లో తెలిపింది. ఏప్రిల్ 11 రాత్రి సుందర్‌బనిలోని కెరీ-బట్టల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక ఆపరేషన్‌ను ధైర్యంగా నడిపిస్తూ తన ప్రాణాలను అర్పించాడని పేర్కొంది.


మరోవైపు, కిష్టావర్ జిల్లాలోని మంచుతో కూడిన ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ తెలిపింది. అంతకుముందు రోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ‘ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కిష్టావర్ ఛత్రులో జరుగుతున్న ఆపరేషన్‌లో మరో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఏకే, ఒక ఎం4 రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు’ అని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. గత నెలలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి కథువా జిల్లాలోకి చొరబడిన ఉగ్రవాదుల కోసం భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. మార్చి 28న కథువాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏడాది కాలంగా పాక్ ఉగ్రవాదులు ఉధంపూర్, దోడా, కిష్టావర్ జిల్లాల ఎత్తైన ప్రాంతాలు, అక్కడి నుంచి కశ్మీర్‌కు చేరుకోవడానికి కథువా ప్రధాన చొరబాటు మార్గంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com